అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ అక్టోబర్ 31 వలిగొండ*జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, యాదాద్రి భువనగిరి జిల్లా వారి ఆదేశాల మేరకు,మాంటిస్సోరి హైస్కూల్, వలిగొండ ఆవరణలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం “సురక్ష బచ్పన్ అభియాన్ – బాలల హక్కులు మరియు పోస్కో చట్టం–2012” అనే అంశంపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జ్ కమ్ చైర్మన్ శ్రీమతి జి.సబిత మండల లీగల్ సర్వీసెస్ కమిటీ, రామన్నపేట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,విద్యార్థులు చిన్నప్పటి నుంచే తమ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, బాలల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ సదస్సులో భాగంగా బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోస్కో చట్టం–2012), గుడ్ టచ్–బ్యాడ్ టచ్, బాలల హక్కులు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆపద సమయంలో సహాయం కోసం చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, పోలీస్ హెల్ప్‌లైన్ 112, న్యాయ సహాయం కోసం 15100 నంబర్లను సంప్రదించవచ్చని వివరించారు.ఈ సందర్భంగా విద్యార్థులు సోషల్ మీడియాను విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, తమ భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగించుకోవాలని, అనవసరమైన ఆకర్షణలకు దూరంగా ఉంటూ చదువుపై పూర్తి శ్రద్ధ చూపాలని సూచించారు. ఉన్నత విద్యను అభ్యసించి, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడంతో పాటు మంచి పౌరులుగా ఎదిగి సమాజ అభివృద్ధికి, దేశ పురోగతికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ అడ్వొకేట్ కొండూరు బాలరాజు ప్రిన్సిపాల్ థామస్ అబ్రహం, సబ్ ఇన్స్పెక్టర్ ఏ.శ్రీకాంత్ రెడ్డి,అడ్వొకేట్స్ కునూరు శ్రీనివాస్,సోమ సతీష్ రెడ్డి, ప్యానెల్ అడ్వకేట్లు కనుగంటి శ్రీశైలం, అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ సభ్యుడు; కురిమేటి యాదయ్య, పారా లీగల్ వాలంటీర్ పాల్గొని విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు. వ్యాస రచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జడ్జి సబిత చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.బాలల హక్కుల పరిరక్షణ, బాలల భద్రత, చట్టాలపై అవగాహన పెంపొందించడంలో ఇటువంటి న్యాయ అవగాహన కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.