వర్షాకాలానికి ముందస్తు చర్యలు.. ప్రజారోగ్యంపై సర్పంచ్ టోనీ ప్రత్యేక దృష్టి

June 12, 2026 | తెలంగాణ

అక్షర ఆయుధం న్యూస్, జూన్ 13, ఖమ్మం జిల్లా, సింగరేణి మండలం (వి. బన్సిలాల్):రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సింగరేణి గ్రామంలో ప్రజారోగ్య పరిరక్షణ కోసం గ్రామ సర్పంచ్ మేదరి టోనీ ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో చికెన్ షాప్‌లు, తాగునీటి ప్లాంట్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు.చికెన్ షాప్‌ల నుంచి వచ్చే వ్యర్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ ప్రదేశాల్లో పారవేయకుండా తగిన విధంగా నిర్వహించాలని సూచించారు. వ్యర్థాల కారణంగా దుర్వాసనలు, దోమలు పెరిగి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని పేర్కొన్నారు. గ్రామంలో పరిశుభ్రతను కాపాడడం ప్రతి వ్యాపారి సామాజిక బాధ్యత అని తెలిపారు.అదేవిధంగా వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు ప్రజలకు నాణ్యమైన తాగునీటిని అందించాలని, నీటి క్యాన్ల సరఫరాలో పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని సూచించారు. మైనర్లతో వాహనాలు నడిపించకూడదని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామస్థులు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సర్పంచ్ టోనీ కోరారు. ప్రజల ఆరోగ్య భద్రతే గ్రామపంచాయతీ ప్రధాన లక్ష్యమని, సమస్యలు తలెత్తిన తర్వాత కాకుండా ముందుగానే నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అన్నారు.ప్రజారోగ్యం, గ్రామ పరిశుభ్రత, సురక్షిత తాగునీటి సరఫరాపై సర్పంచ్ మేదరి టోనీ తీసుకుంటున్న చొరవను గ్రామస్థులు అభినందిస్తున్నారు.

🌐 Select Language:
📰 ePaper