డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : గుండాల ఎస్సై ఎం. శోభన బాబు.
గుండాల జూన్ 22అక్షర ఆయుధం ప్రతినిధి గుండాల మండలంలోని వెల్మజల గ్రామంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుండాల సబ్ ఇన్స్పెక్టర్ ఎం. శోభన బాబు ముఖ్యంగా పాల్గొని విద్యార్థులు, యువత మరియు గ్రామ ప్రజలకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు.ఈ సందర్భంగా ఎస్సై శోభన బాబు మాట్లాడుతూ, మత్తు పదార్థాల బారిన పడిన వ్యక్తుల జీవితాలు చిన్నాభిన్నం అవుతాయని అన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, చెడు అలవాట్లకు బానిసైతే భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరించారు. డ్రగ్స్ వల్ల ఆరోగ్యం, కుటుంబం, సమాజం తీవ్రంగా నష్టపోతాయని పేర్కొన్నారు.డ్రగ్స్ వద్దు – స్పోర్ట్స్ ముద్దు” అనే నినాదంతో యువతను క్రీడల వైపు మళ్లించాలని ఆయన సూచించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిస్తే మంచి భవిష్యత్తు సాధించవచ్చని చెప్పారు. యువత తమ లక్ష్యాలను సాధించాలంటే క్రమశిక్షణతో కూడిన జీవనం గడపాలని, మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌసుద్దిన్ అధ్యక్షత వహించారు. గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.