సర్పంచ్ ‘బోడ సాగర్’ భగీరథ ప్రయత్నం.. రంగసాగర్ ‘బడి’కి మోక్షం!*​మూతపడిన పాఠశాల పునఃప్రారంభం.. సర్పంచ్ పట్టుదలకు గ్రామస్తుల జేజేలు

June 21, 2026 | తెలంగాణ

​అక్షర ఆయుధం న్యూస్: 21 జూన్, బీర్పూర్ మండలం, రంగసాగర్ ​వార్త విశ్లేషణ : రంగసాగర్ గ్రామ విద్యార్థుల భవిష్యత్తు కోసం స్థానిక సర్పంచ్ బోడ సాగర్ చేసిన నిరంతర కృషి, పట్టుదల ఫలించాయి. గత కొంతకాలంగా మూతపడి ఉన్న రంగసాగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, గ్రామ పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఏకైక లక్ష్యంతో సర్పంచ్ బోడ సాగర్ ఒక సవాల్‌గా తీసుకున్నారు. ఆయన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వడ్లూరి అనిల్‌తో కలిసి ఉన్నతాధికారుల చుట్టూ తిరిగి, ప్రత్యేక అనుమతులు సాధించి, బడి తలుపులు తెరిపించే వరకు అహర్నిశలు శ్రమించారు. ఆయన చేసిన ఈ భగీరథ ప్రయత్నం కారణంగానే ఈరోజు పాఠశాల అత్యంత ఘనంగా పునఃప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాధికారి నాగభూషణం రిబ్బన్ కట్ చేసి పాఠశాలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ ఒక ఊరి సర్పంచ్ మనసు పెడితే ఎంతటి మార్పు వస్తుందో చెప్పడానికి బోడ సాగర్ నిదర్శనమని, పాఠశాల పునఃప్రారంభం కోసం ఆయన పడిన తపన, చూపిన నాయకత్వ పటిమ అత్యంత అభినందనీయమని సర్పంచ్‌ను వేదికపై ప్రత్యేకంగా కొనియాడారు. సుదీర్ఘ విరామం తర్వాత తమ ఊరి బడి గంట మోగడంతో రంగసాగర్ గ్రామ విద్యార్థులు, తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇన్నాళ్లూ చదువుల కోసం పడ్డ ఇబ్బందులు తొలగించి, బడికి మళ్లీ పూర్వవైభవం తెచ్చిన సర్పంచ్‌కు గ్రామస్తులంతా కృతజ్ఞతలు తెలుపుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్ బోడ సాగర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అపురూప ఘట్టంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, పిల్లల తల్లిదండ్రులు, మరియు అంగన్‌వాడీ కార్యకర్త తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

🌐 Select Language:
📰 ePaper