వడ్లు కొనడానికి రెండు నెలల తిప్పలు.. గడ్డి కొయ్యలకైతే నిమిషాల్లో జరిమానాలా?

June 7, 2026 | సినిమా వార్తలు

యువనేత మ్యాడ శ్రీనివాస్ నిప్పులు

ధాన్యం అమ్ముడుపోక రైతు కడుపు కాలుతుంటే లేని చట్టాలు గడ్డి కాలిస్తే గుర్తొస్తాయా.. ప్రత్యామ్నాయం చూపకుండా పెనాల్టీలు వేస్తే ఊరుకోం: అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం

​అక్షర ఆయుధం న్యూస్: 07 జూన్, బీర్‌పూర్ విశ్లేషణ: నిబంధనల అమలులో చూపించే ఉత్సాహం, అధికార జులం అన్నదాతల కష్టాలను తీర్చడంలో ఎందుకు కనిపించడం లేదని, సొంత పెట్టుబడులు, రక్తాన్ని చెమటగా మార్చి పండించిన పంటను అమ్ముకోలేక ఒకవైపు రైతు కన్నీరు పెడుతుంటే పట్టించుకోని అధికార యంత్రాంగం, జరిమానాలు వసూలు చేయడానికి మాత్రం ఇంతగా జబర్దస్తీ చేయడం ఏ రకమైన న్యాయమంటూ బీర్‌పూర్ మండల యువనేత, రైతు బిడ్డ మ్యాడ శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలాల్లో గడ్డి కొయ్యలు కాల్చారనే సాకుతో రైతులకు జరిమానాలు విధించడంపై ఆయన నిప్పులు చెరుగుతూ, అధికారుల ఏకపక్ష మరియు ద్వంద్వ వైఖరిని తీవ్రస్థాయిలో కడిగిపారేశారు. పొలాల్లో గడ్డి కాల్చడం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని జరిమానాలు వేయడం చట్టప్రకారం బాగుందని, తాము కూడా చట్టాన్ని గౌరవిస్తామని చెప్తూనే, మరి అదే రైతు పండించిన వడ్లు అమ్ముడుపోక, మార్కెట్లలోనూ, ఐకేపీ కొనుగోలు కేంద్రాల వద్ద రెండు నెలల నుండి తిండి తిప్పలు లేక పడిగాపులు కాస్తుంటే ఏ గ్రామ పంచాయతీ స్పందించిందని, రైతుల ఆకలి కేకలపై ఎందుకు తక్షణ చర్యలు తీసుకోలేదని ఆయన నిలదీశారు. కేవలం పెనాల్టీలు బాదడానికి మాత్రమే రూల్స్ గుర్తొచ్చే అధికారులకు, రెండు నెలలుగా నడిరోడ్డుపై నలుగుతున్న రైతు కష్టాలు ఎందుకు లోకువగా కనిపిస్తున్నాయని ప్రశ్నించారు.
​రైతులపై ఏకపక్ష నిర్ణయాలు రుద్దడం కాకుండా, వ్యవస్థగా గ్రామ పంచాయతీకి కొన్ని కనీస బాధ్యతలు ఉంటాయన్న విషయాన్ని అధికారులు మరవరాదని హితవు పలికారు. శిక్షలు వేయడానికి ముందే ప్రతిగ్రామ పంచాయతీ పరిధిలో ఒక ప్రత్యేక గ్రామసభ నిర్వహించి ప్రజా తీర్మానం చేయాలని, వ్యవసాయ శాఖ అధికార బృందంతో క్షేత్రస్థాయిలో సదస్సులు పెట్టి గడ్డిని కాల్చడం వల్ల జరిగే నష్టాలపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత స్థానిక సంస్థలపై ఉందన్నారు. గడ్డిని తగలబెట్టకుండా దాన్ని భూమిలోనే కుళ్ళింపజేసేందుకు అవసరమైన యంత్రాలను లేదా ప్రత్యామ్నాయ మార్గాలను పంచాయతీ ద్వారా రైతులకు ఉచితంగా అందుబాటులో ఉంచి, తగిన మేలైన సూచనలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవస్థల తరఫున రైతులకు కనీస అవగాహన కల్పించకుండా, ప్రత్యామ్నాయ దారులు చూపకుండా, నేరుగా వచ్చి జరిమానాలు బాదుతామంటే సహించేది లేదని, ఒక బాధ్యతగల వ్యవస్థగా అన్ని దారులు చూపించిన తర్వాత కూడా ఎవరైనా వినకపోతే అప్పుడు జరిమానా వేయడంలో తప్పు లేదని స్పష్టం చేశారు. కనీస అవగాహన కల్పించకుండా ముందే జరిమానాల పేరుతో వేధిస్తామంటే ఒక రైతు బిడ్డగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని హెచ్చరించిన మ్యాడ శ్రీనివాస్, ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి, మొదట రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వడ్ల కొనుగోళ్లను పూర్తి చేసి రైతును ఆదుకోవాలని, ఆ తర్వాతే జరిమానాల ముచ్చట మాట్లాడాలని డిమాండ్ చేశారు.

🌐 Select Language:
📰 ePaper