
ఈ పథకంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట…
గండేపల్లి మండలం యల్లమిల్లి లో పథకం ప్రారంభోత్సవంలో గ్రామ టిడిపి అధ్యక్షులు సుంకవిల్లి వీర వెంకట సత్యనారాయణ …
కాకినాడ జిల్లా గండేపల్లి జులై 3:అక్షర ఆయుధం ప్రతినిధిగ్రామీణ పేదలకు ప్రతీ ఒక్కరికీ 125 రోజుల పాటు పని కల్పించడంతో పాటు పల్లెలకు దీర్ఘకాలిక ఆస్తులను సృష్టించేందుకు కేంద్రం తీసుకొచ్చిన వీజీబీ రామ్ జీ పథకం అద్భుతమైనదని గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామ టిడిపి అధ్యక్షులు సుంకవీల్లి వీర వెంకట సత్యనారాయణ ( యల్లమిల్లి సీఎం)పేర్కొన్నారు. ఉపాధి కూలీలతో కల్సి శుక్రవారం ఈ పథకాన్ని ఆయన ప్రారంభించారు. వారితో కల్సి కొబ్బరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో కూటమి ప్రభుత్వంలో గతంలో ఉండే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు తీసుకువచ్చి వీజీ రామ్ జీ పథకంగా రూపొందించిందన్నారు. ఈ పథకంలో కూలీలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కనీస వేతనం రూ.300పైన ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. మన రాష్ట్రంలో రోజువారీ కూలీ రూ.307 నుంచి రూ.312కు పెరుగుతుందన్నారు. వ్యవసాయ పనిదినాల్లో కూలీలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు. పనిరోజులు పెంచడం,జీతాలు పెంచడంతో పాటు గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీలు, ప్రభుత్వస్కూలు బిల్డింగుల నిర్మాణం, ఆసుపత్రుల నిర్మాణం మొదలైన పనులు కూడా చేర్చారు. వ్యవసాయానికి ఉపయోగపడేలా కాలువల బాగుచెయ్యడం వంటివి చేర్చారన్నారు. ఉపాధి, మౌలిక వసతుల కల్పన, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి, ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల సమయంలో కూడా ఈ పథకం వర్తిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు, కేంద్ర ప్రభుత్వం 60శాతం నిధులు ఈ పథకానికి వినియోగించేలా మార్పులు జరిగాయన్నారు. మన జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడే జలసంరక్షణ, మౌలికవసతుల కల్పనకు ఈ పథకం వినియోగించు కుందామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మద్దిపూడి వీర వెంకట సత్యనారాయణ, దేవిశెట్టి బాబ్జి, మాదిరెడ్డి కృష్ణ,కలిపే శేషయ్య, అధిక సంఖ్యలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు.