Header
05 Nov 2026 | 03:49 PM

బొడ్రాయి తండాలో మల్లయ్య కుంట తండా వాసి విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

*11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి దుర్మరణం.. ఆరు నెలల కుమారుడికి తండ్రిని దూరం చేసిన విషాదం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ మల్లయ్య కుంట తండావాసుల నిరసన*

*అక్షరం–ఆయుధం న్యూస్ రిపోర్టర్: బాలెం వెంకటేష్ డోర్నకల్, అక్టోబర్ 13:* మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బొడ్రాయి తండాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వేపచెట్టు కొమ్మలు కొడుతుండగా 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో ధరంసోత్ అకిల్ (26) అనే యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ ఘటనతో మల్లయ్య కుంట తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.*టెంట్ హౌస్ పనుల కోసం వచ్చి.. విగతజీవిగా మారి,* మల్లయ్య కుంట తండాకు చెందిన ధరంసోత్ అకిల్ జీవనోపాధి కోసం టెంట్ హౌస్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. టెంట్ సామగ్రి కోసం బొడ్రాయి తండాకు వచ్చిన క్రమంలో ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. వేపచెట్టు కొమ్మలు కొడుతుండగా పైన ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.*ఆరు నెలల కుమారుడికి తీరని లోటు* మృతుడు అకిల్‌కు భార్యతో పాటు కేవలం ఆరు నెలల వయసున్న కుమారుడు ఉన్నాడు. కుటుంబానికి జీవనాధారంగా ఉన్న యువకుడు అకాల మరణం చెందడంతో భార్య, చిన్నారి దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు. కుటుంబ పోషకుడిని కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. *బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ నిరసన* యువకుడి మృతితో ఆగ్రహానికి గురైన మల్లయ్య కుంట తండావాసులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. కుటుంబానికి తగిన ఆర్థిక పరిహారం అందించాలని, ఘటనకు సంబంధించిన వాస్తవాలను వెలికితీసి బాధ్యులుంటే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.*ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. విచారణ ప్రారంభం* సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. టెంట్ సామగ్రి కోసం తండాకు వచ్చిన అకిల్ వేపచెట్టు ఎందుకు ఎక్కాడు? చెట్టు ఎక్కమని ఎవరు చెప్పారు? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఘటనకు దారితీసిన పరిస్థితులపై విచారణ కొనసాగుతోంది.*ప్రభుత్వం స్పందించాలి.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి!* చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు మోస్తున్న యువకుడు విద్యుత్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆరు నెలల పసికందు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి తగిన పరిహారం అందించాలని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.