04 Sep 2026 | 03:48 PM

విమర్శల కంటే ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం..మిరియాల ప్రీతమ్

-ప్రజల కోసం నిరంతరం కష్టపడే ఎమ్మెల్యే గాంధీ.. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయం

శేరిలింగంపల్లి, ఆగస్టు 30 (అక్షర ఆయుధం న్యూస్ ప్రతినిధి కృష్ణ): రాజకీయాలలో ఇతరులను విమర్శించడం, వారి తప్పులను ఎత్తిచూపడం ద్వారా ప్రచారం పొందడం కంటే ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేయడమే ముఖ్యమని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మిరియాల ప్రీతమ్ అన్నారు. ప్రజలకు నిజంగా ఉపయోగపడే పనులు చేయడమే అసలైన నాయకత్వమని ఆయన పేర్కొన్నారు. తాను భవిష్యత్తులో ఎన్నికలలో కార్పొరేటర్‌గా పోటీ చేసే అవకాశం వస్తే, ఇతరులను ప్రత్యర్థులుగా భావించడం కంటే తనకు తనే ప్రత్యర్థిగా భావించి ప్రతిరోజూ తన పనితీరును మరింత మెరుగుపరుచుకునే దిశగా పనిచేస్తానని తెలిపారు. ఒకరిని విమర్శించడం, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య మంత్రులను తిట్టడం లేదా దిష్టిబొమ్మలు దహనం చేయడం ద్వారా ప్రచారం పొందాలని కొందరు ప్రయత్నిస్తుంటారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నామనే పేరుతో కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడం మాత్రమే కాకుండా, ప్రజల కోసం తాము ఏం చేశామో కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందన్నారు. ప్రభుత్వానికి ప్రజా సమస్యలను పరిష్కరించే బాధ్యత ఉన్నప్పటికీ, పౌరులుగా మన బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తించాలని మిరియాల ప్రీతమ్ సూచించారు. ఇంట్లోని చెత్తను రోడ్లపై, డ్రైనేజీలలో పడేసి అనంతరం మున్సిపల్ అధికారులు, ప్రభుత్వాన్ని విమర్శించడం సరైన పద్ధతి కాదన్నారు. ముందుగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు చుట్టుపక్కల వారికి కూడా పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఇటీవల జరిగిన ఒక డ్రైనేజీ ఘటనను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, డ్రైనేజీలో ఓ వ్యక్తి పడిపోయిన ఘటనలో సహాయక చర్యలు చేపట్టిన సమయంలో పెద్ద పరుపులు, దిండ్లు, వైర్లు, ఇతర చెత్త బయటకు రావడం చూసి ఆశ్చర్యపోయామని తెలిపారు. ఇలాంటి వస్తువులను డ్రైనేజీలలో వేయడం వల్ల మురుగునీటి వ్యవస్థకు ఆటంకాలు ఏర్పడి ప్రజలకే ఇబ్బందులు కలుగుతాయని పేర్కొన్నారు. ఒకరిని విమర్శించే ముందు తాము సమాజం కోసం ఏం చేస్తున్నామో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలని సూచించారు. ఒక వేలు ఎదుటివారిని చూపిస్తే మిగిలిన వేళ్లు మన వైపే చూపుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. సోషల్ మీడియాలో ఇతర నాయకులను తిట్టడం ద్వారా లైక్స్, ప్రచారం పొందడం గొప్ప విషయం కాదని, అవసరమైన సమయంలో ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే నిజమైన ప్రజాసేవ అని తెలిపారు. ఇటీవల దోమల సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో ప్రభుత్వానికి సహకారంగా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని, తన సొంత నిధులతో దోమల మందు పిచికారీ చేయించినట్లు వెల్లడించారు. ప్రజా సమస్య ఎక్కడ ఉన్నా తనకు చేతనైన మేరకు స్పందించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ సేవలను మిరియాల ప్రీతమ్ ప్రశంసించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కష్టపడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడు ఎమ్మెల్యే గాంధీ అని అన్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే గాంధీ ముందుకు సాగుతున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే ఎమ్మెల్యే గాంధీకి అండగా నిలుస్తూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువత కృషి చేయాలని మిరియాల ప్రీతమ్ పిలుపునిచ్చారు.

🌐 Select Language:
📰 ePaper